శ్రీ గురుభ్యోన్నమః మనిషి మనుగడకు అవసరమైన స్థైర్యాన్ని, భవిష్యత్తుపై నమ్మకాన్ని, జీవితంపై సంపూర్ణ అవగాహనను ఇచ్చే మహోన్నతమైన శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం. ఆకాశంలో ఆసక్తిని రేకెత్తించే తారలను గమనించటంతో ఆరంభమైన జ్యోతిష శాస్త్రం నేడు శాఖోపశాఖలుగా విస్తరించి, అనునిత్యం అన్ని అంశాలలో మనిషి మనుగడకు సహాయపడుతున్నది. జ్యోతిష శాస్త్రం ప్రధానంగా మూడు విభాగాలలో విస్తరించింది. సిద్ధాంత, సంహిత, హోరా విభాగాలు. సిద్ధాంత స్కంధాన్ని గణిత స్కంధం అని కూడా అంటారు. దీనిలో గ్రహ గణితానికి సంబంధించిన ముఖ్య విషయాలు ఉంటాయి. గ్రహాల మధ్యమ స్థితి, స్పష్ట స్థితి, సంవత్సర-ఆయన-మాసాది కాలనిర్ణయం, గ్రహణాదులు మొదలైన గణితాధార విషయాలను వివరిస్తుంది. దీనిలో మూడు విభాగాలుంటాయి. 1) కల్పారంభం నుంచి గ్రహగణితం కలిగిన దానిని సిద్ధాంతమని, 2) ఒక మహాయుగం నుంచి గ్రహగణితం కలిగిన దానిని తంత్రమని, 3) ఒక శక సంవత్సరం నుంచి గ్రహ గణితం కల దానిని కరణమని అంటారు. సంహిత విభాగములో ఖగోళములో గ్రహభ్రమణాలు, తోకచుక్కలు, ఉల్కాపాతాలు,గ్రహణాలు మొదలైన వాటివలన ప్రపంచానికి జరిగే శుభాశుభాలకు సంబంధించిన విషయాలు, ముహూర్త సంబంధ విషయాలు ఉంటాయి. హోరా విభాగం మనిషి జన్మ సమయాన్ని ఆధారంగా చేసుకొని అతని జీవితంలో జరిగే శుభాశుభాలను వివరిస్తుంది. దీనికే జాతక స్కంధం అని పేరు. దీని ద్వారా మనిషి జన్మించిన సమయం , ప్రదేశం ఆధారంగా అతని జాతకచక్రాన్ని లిఖించి అయా గ్రహ, భావ, యోగాల అధారముగా అతని జీవితములో జరిగే శుభాశుభ ఫలాల్ని విశ్లేషించటం జరుగుతుంది. ముందుగా జ్యోతిషాధ్యయనం చేయాలనుకునే వారు కలిగి ఉండవలసిన లక్షణాలు ఒక సారి చూద్దాం. జ్యోతిషం మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే శాస్త్రం. ఇది ఎవరు పడితే వారు దీనిని అధ్యయనం చేసే అర్హత లేదు. దీనిని అధ్యయనం చేసి, జ్యోతిష ఫలితాలను చెప్పాలనుకునేవారు తప్పనిసరిగా కలిగి ఉండవలసిన లక్షణాలను మన జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో పొందుపరచారు. జ్యోతిష్కుడు ఎలా ఉండాలో మన శాస్త్రాలు ఈ విధంగా నిర్దేశిస్తున్నాయి. శ్లో.1. అద్వేషీ నిత్యసంతుష్టః గణితాగమ పారగః। ముహూర్తగుణ దోషజ్ఞో వాగ్మీ కుశలబుద్దిమాన్ ।। 2. శాంతశ్చామృతవాక్సౌమ్యః త్రికాలజ్ఞో జితేంద్రియః । నిత్యకర్మరతో యో వై స దైవజ్ఞః ప్రకీర్తితః ।। ద్వేష స్వభావములేనివాడు, ప్రతినిత్యం జీవితాన్ని సంతోషముతో గడిపేవాడు, గణిత శాస్త్రంపై సంపూర్ణ అవగాహన కలవాడు, ముహూర్తము యొక్క గుణదోషాలను తెలిసియున్నవాడు,( అంటే సమయము పై మంచి అవగాహన కలిగిఉండేవాడని అర్థం.) మంచి సంభాషణానైపుణ్యం కలవాడు, సూక్ష్మబుద్ధికలవాడు అయి ఉండాలి. ఎల్లప్పుడు ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండాలి. ఎదుటివారిని నొప్పించని మృదువైన సంభాషణాచాతుర్యం కలిగి ఉండాలి. భూత, భవిష్యత్ వర్తమానాలపైన మంచి అవగాహన కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. వారికి నిర్దేశించిన నిత్యకర్మలను ప్రతినిత్యం ఆచరించేవాడై ఉండాలి. ఇటువంటి సత్సాంప్రదాయములు నిరంతరం ఆచరిస్తూ జ్యోతిషం అభ్యసించే వారిని జ్యోతిష శాస్త్ర అధిదేవత అయిన ఆ వాగ్దేవి అన్ని రకాలుగా కాపాడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో గల ఆసక్తికర అంశాలను పాఠాల ద్వారా తెలుసుకుందాం.
ఏ మనిషికైనా భవిష్యత్తు గురించి కొద్దో గొప్పో బెంగ ఉండే ఉంటుంది. రేపు తనకు జరగబోయే శుభాశుభాలను గురించి తెలుసుకోవటం, ఏవైనా బాధలుంటే వాటికి నివారణోపాయాలను వెతుక్కోవాలనుకోవటం, ప్రతిక్షణం సుఖసంతోషాలతో జీవించాలనుకోవటం మనిషి నైజం. ఆ సుఖవంతమైన జీవితం అన్వేషణలోనే ఎన్నో రకాల శాస్త్రవిషయాలను కనుక్కోవటం జరుగుతున్నది. అయినప్పటికి భవిష్యత్తును తెలుసుకోవాలన్నా, దానిని సుఖవంతముగా మార్చుకోవాలన్నా అది ఒకే ఒక శాస్త్రంతోనే సాధ్యమవుతుంది. అదే జ్యోతిష శాస్త్రం.జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనము జన్మించిన సమయానికి ఖగోళములోని గ్రహస్థితులను సూచిస్తూ వేయబడే చక్రాన్నే జాతకము అంటారు. దీనినే జాతకచక్రము, జన్మకుండలి, హోరోస్కోప్ ఇలా వివిధ రకాల పేర్లతో ఆయా ప్రాంతాలవారు సంబోధిస్తుంటారు. ఒక వ్యక్తి జన్మించిన సమయము, ప్రదేశము ఆధారముగా జాతకచక్రము గణించబడుతుంది. ఖగోళములోని గ్రహస్థితులను గణితాధారముగా లెక్కించి, ఆయా రాశి, నక్షత్ర, భావాలలో ఉన్న గ్రహాల ఆధారముగా భవిష్యత్తు చెప్పబడుతుంది.దీని గణనలో కాని, జన్మించిన సమయములో కాని తప్పు జరిగినట్లయితే అది ఆ నిర్దేశిత వ్యక్తి జాతకం కాక వేరే వారి జాతకం అవటమే కాకుండా, ఈ వ్యక్తికి చెప్పబడ్డ భవిష్య ఫలాలన్నీ తప్పే అవకాశం ఉంటుంది.కాబట్టి భవిష్యత్తు తెలుసుకోవలనుకుంటే జాతక చక్రము అత్యావశ్యమైనదిగా చెప్పబడింది. జ్యోతిషమనే మహాసముద్రములో జాతకము ఒక నీటి బిందువులాంటిది. అటువంటి జాతకచక్రము వేయటానికి ముందు మన రాశి, నక్షత్రములను తెలుసుకోవటం ఎలాగో నేర్చుకుందాము. ఈ జ్యోతిషపాఠాలు క్రమం తప్పకుండా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఒక పాఠం చదవకపోయినా ఎంతో సమాచారాన్ని కోల్పోయినవారవుతారు.జన్మ రాశి – నక్షత్రం తెలుసుకునే విధానంమన రాశి, నక్షత్రం తెలుసుకోవాలంటే మనం పుట్టిన సంవత్సరానికి గణించబడ్డ దృగ్గణిత పంచాంగం మన వద్ద ఉండాలి. (మీరు జాతక సంబంధ ఏ గణితం చేసినా దృగ్గణిత పంచాగములతోనే చేయండి). ఆ పంచాంగములో ప్రతి రోజు తిథి, వార, నక్షత్ర, యోగ మరియు కరణాల అంత్యసమయాలు ఇవ్వబడతాయి. మీకు ప్రస్తుతం చంద్రస్థితి తెలిస్తే సరిపోతుంది. మీరు పుట్టిన రోజున చంద్రుడు ఏ రాశిలో ఉంటే అదే మీ జన్మరాశి అవుతుంది. ఉదా: తేది 26-03-2004 రోజున మధ్యాహ్నం 2 గంటలకు ఒకరు జన్మించారనుకోండి. ఆ రోజు ఆంధ్రపత్రిక (పిడపర్తి వారి) పంచాంగములో ఉదయం 06:58 వరకు కృత్తికా నక్షత్రం ఉన్నది. అంటే ఉదయం 06:58 నుంచి రోహిణి నక్షత్రం ఆరంభమవుతున్నది. అంటే చంద్రుడు ఆ రోజు రోహిణీ నక్షత్రంలో, వృషభ రాశిలో సంచరిస్తున్నాడని అర్థం. ఈ రోహిణీ నక్షత్రం తెల్లవారి ఉదయం 10:01 ని. వరకు ఉన్నది. అంటే 26-03-2004 ఉదయం 06:58 నుంచి తెల్లవారి(27-03-2004) ఉదయం 10:01 మధ్యలో ఎవరు జన్మించినా వారి నక్షత్రం రోహిణి అవుతుంది. చంద్రుడు సంచరిస్తున్న రోహిణి నక్షత్రం వృషభరాశిలో ఉంటుంది. కనుక ఈ రోజు ఎవరు జన్మించినా వారిది రోహిణీనక్షత్రం, వృషభరాశి అవుతుంది.మీరు జన్మించిన సంవత్సర పంచాంగంలో, మీరు పుట్టిన తేదీకి ఏ రాశి, నక్షత్రాలున్నాయో చూడండి. ఒకవేళ మీ వద్ద ఆ సంవత్సరం పంచాంగం లేనట్లయితే నా వెబ్ సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. ఆన్ లైన్ జ్యోతిష్ డాట్ కామ్‌లో పంచాంగం పేజీలో, మీరు ఏ సంవత్సరానికైనా, ఏ తేదీకైనా పంచాంగాన్ని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.ఈ క్రింద ఇవ్వబడ్డ తేదీలకు రాశి, నక్షత్రాలు ఏవి వస్తాయో గణించి కామెంట్స్ ద్వారా కానీ, ఈ- మెయిల్ ద్వారా కానీ నాకు తెలియజేయండి.1. 11-10-1967, 10:10, హైదరాబాద్, 2. 24-04-1973, 06:00, ముంబై, 3. 10-08-2003, 12:00, విజయవాడ.తర్వాతి పాఠములో నక్షత్రపాదం తెలుసుకోవటం, జన్మనామం తెలుసుకోవటం ఎలాగో నేర్చుకుందాం. మీకు ఈ జ్యోతిష పాఠాలకు సంబంధించి ఏవైనా సందేహాలున్నా, సలహాలు, సూచనలు ఇవ్వదలచినా నాకు ఈ-మెయిల్ చేయవచ్చు.
నక్షత్ర పాద గణన జన్మ నక్షత్రం మరియు నక్షత్ర పాదాన్ని ఎలా లెక్కించాలి?
నక్షత్ర పాద గణనగతపాఠంలో రాశి మరియు జన్మనక్షత్రాన్ని తెలుసుకోవటమెలాగో నేర్చుకున్నారు. ఈ పాఠములో ముందుగా నక్షత్రపాదం లెక్కించటమెలాగో తెలుసుకుందాము. గత పాఠములో ఇచ్చిన రాశి, నక్షత్రాలు మీకు ఈపాటికి కంఠస్థమై ఉంటాయని భావిస్తున్నాను. ఒకవేళ వాటిని కంఠస్థం చేయక నిర్లక్ష్యం చేస్తే మీరు జ్యోతిషం నేర్చుకోవటం విషయంలో మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవలసి ఉంటుంది.ప్రతి నక్షత్రం నాలుగు పాదాలుగా విభజించబడింది. 27 నక్షత్రాలు 108 పాదాలుగా రాశిచక్రములో విభజింపబడ్డాయి. ఒక్కో పాదానికి ఒక్కో అక్షరం ఇవ్వబడింది. ముందు నక్షత్ర పాదాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. నోట్ పాడ్, కాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొండి.ఉదా:- ఒక వ్యక్తి 05-04-2004 రోజున ఉదయం 10గంటలకు జన్మించాడనుకోండి. ఆరోజు పిడపర్తివారి పంచాంగానుసారం హస్తా నక్షత్రం సాయంత్రం 06గంటల39నిమిషాల వరకు ఉన్నది. గడిచిన రోజు రాత్రి 8 గంటల నాలుగు నిమిషాలకు ఆరంభమయ్యింది. నక్షత్రం ఆరంభమునుంచి అంత్యము వరకు గల సమయాన్ని లెక్కించండి. ఇవ్వబడిన నక్షత్ర ఆద్యంత సమయము 22 గంటల 35 నిమిషములు. దీనినే రుక్షాద్యంతము అని అంటారు.(రుక్షము అంటే నక్షత్రము అని అర్థము).ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు. ఈ నాలుగు పాదాలు గడవటానికి పట్టిన సమయం 22గంటల 35 నిమిషాలు అయినప్పుడు ఒక పాదం గడవటానికి ఎంత సమయం అవుతుంది. ( 22 60 ్శ 35 / 4 ్స ? ) దాదాపు 5 గంటల 39 నిమిషాలు.నక్షత్ర ఆరంభ సమయం నుంచి జన్మ సమయం వరకు అయిన సమయాన్ని లెక్కించండి. 13 గంటల 56 నిమిషములు. దీనిలో రెండుపాదాల సమయం అంటే 11 గంటల 18 నిమిషాలు గడిచిపోగా ఇంకా 2గంటల 38 నిమిషాలు శేషం మిగిలిఉన్నది. అంటే జాతకుని జన్మ సమయానికి హస్తానక్షత్రము రెండు పాదాలు గడిచి మూడవపాదం నడుస్తున్నది. అంటే జాతకుడు హస్తానక్షత్రం 3వ పాదములో జన్మించాడని తెలుస్తున్నది.మళ్ళీ ఒకసారి గమనిస్తే ముందుగా జాతకుడు జన్మించిన నాటి నక్షత్ర ఆద్యంతాలను తీసుకొండి. దానిని 4చే భాగించండి. జాతకుడు జన్మిచిన సమయానికి ఎన్ని పాదాలు కొట్టుడుపోతున్నాయో గమనించండి. శేషం ఏ పాదములో పడుతున్నదో గమనించండి.అదే ఆ జాతకుని జన్మ నక్షత్రపాదం. తర్వాతి పాఠములో ప్రతి నక్షత్ర పాదానికి గల జన్మ నామాక్షరాలను, వాటికి వచ్చే పేర్లను తెలుసుకుందాం. శెలవు.
జన్మనామం జన్మనామం అంటే ఏమిటి? దాన్ని ఎలా తెలుసుకోవాలి? ఏ నక్షత్రానికి ఏ అక్షరాలు వస్తాయి?
జ్యోతిష శాస్త్రజ్ఞులు సామాన్యులు సైతం తమ రాశి నక్షత్రాలను మరిచిపోకుండా ఉండే విధంగా ఆయా నక్షత్ర పాదాలు ఏ ఏ అక్షరాలను ప్రభావితం చేస్తాయో వాటికి అనుగుణంగా ప్రతి నక్షత్ర పాదానికి ఒక అక్షరాన్ని ఇవ్వడం జరిగింది. ఆ నక్షత్రములో ఆ పాదములో జన్మించిన వ్యక్తులు ఆ నక్షత్రపాదానికి సూచించబడిన అక్షరముతో ఆరంభమయ్యే పేరును తమ జన్మ నామముగా పెట్టుకునే విధానాన్ని మన ప్రాచీనులు ఏర్పాటు చేశారు. జన్మనామాక్షరాలకు సంబంధించి పూర్తివివరాలను లఘు బ్రహ్మయామిళ గ్రంథములో పొందవచ్చు. మీ జన్మనక్షత్రముద్వారా మీ జన్మ నామాన్ని తెలుసుకునే విధంగా నక్షత్రాలు వాటికి సూచించబడిన అక్షరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. అశ్విని – చు, చే, చో, లా భరణి – లీ, లూ, లే, లో కృత్తిక – ఆ, ఈ, ఊ, ఏ రోహిణి – ఓ, వా, వీ, వు మృగశిర – వే, వో, కా, కీ ఆరుద్ర – కూ, ఘ, జ్ఞ, ఛ పునర్వసు – కే, కో, హా, హీ పుష్యమి – హూ, హే, హో, డ ఆశ్రేషా – డీ, డూ, డే, డో మఖ – మా, మీ, మూ, మే పుబ్బ – మో, టా, టీ, టూ ఉత్తర – టే, టో, పా, పీ హస్త – పూ, షం , ణా, ఠా చిత్త – పే, పో, రా, రీ స్వాతి – రూ, రే, రో, తా విశాఖ – తీ, తూ, తే, తో, అనురాధ – నా, నీ, నూ, నే జ్యేష్ఠ – నో, యా, యీ, యూ మూల – యే, యో, బా, బీ పూర్వాషాఢ – బూ, ధా, ఫా, ఢ ఉత్తరాషాఢ – బే, బో, జా, జీ శ్రవణం – జూ, జే, జో, ఖ ధనిష్టా – గా, గీ, గూ, గే శతభిషం – గో, సా, సీ, సూ పూర్వాభాద్ర – సే, సో, దా, దీ ఉత్తరాభాద్ర – దూ, శ్యం , ఝ, థ రేవతి – దే, దో, చా, చీ ఉదాహరణకు మీరు చిత్త నక్షత్రం రెండవ పాదములో జన్మించారనుకోండి చిత్తా నక్షత్రానికి ఇవ్వబడిన అక్షరాలు పే, పో, రా, రీ మొదటి పాదములో జన్మించిన వారి జన్మనామం పే అక్షరముతో ప్రారంభమవుతుంది. పేరయ్య, పేరమ్మ చిత్తా నక్షత్రము మొదటి పాదములో జన్మించిన వారి జన్మనామం అవుతుంది. అలాగే రెండో పాదములో పుట్టిన వారి జన్మనామం పోతన, పోచమ్మ అవుతుంది. ఈ విధంగా ఆయా నక్షత్ర పాదాలలో జన్మించిన వారికి ఆయా జన్మనామాలు ఏర్పడతాయి.పేరు మొదట్లో ద్వంద్వాక్షరం వచ్చినట్లయితే మొదటి అక్షరమును విడిచి రెండవదానినే జన్మనామాక్షరముగా గ్రహించ వలెను.ఉదా: చ్యవన అనే పేరులో చ తర్వాత వచ్చే యాను జన్మ నామాక్షరముగా తీసుకోవాలి.కృష్ణుడు – మృగశిర మూడవ పాదము, హృష్ణుడు స్వాతి మొదటి పాదము, శ్రీధరుడు చిత్తా నాలుగవ పాదము, క్షేత్ర పాలుడు హస్తా రెండవ పాదము, ఈ విధముగా జన్మ నామాలకు నక్షత్రాలను తెలుసుకోవాలి.
పారిభాషిక పదాలు జ్యోతిషం నేర్చుకునేవారు తెలుసుకోవాల్సిన పారిభాషికపదాలు.
గ్రహాల పరిచయం గ్రహముల నక్షత్రములు, దశా సంవత్సరములు, మిత్ర, శతృ మరియు సములు
రాశుల తర్వాత గ్రహాల గురించి తెలుసుకుందాము. భారతీయ జ్యోతిష శాస్త్రం తొమ్మిది గ్రహాలని జాతక విశ్లేషణ కొరకు ఉపయోగించింది. 1. సూర్యుడు 2. చంద్రుడు 3. కుజుడు 4. బుధుడు 5. గురువు 6. శుక్రుడు 7. శని 8. రాహువు 9. కేతువు ఆధునిక జ్యోతిష్కులు మరో మూడు గ్రహాల్ని గుర్తించారు, అవి. 1. యురేనస్ 2. నెప్ట్యూన్ 3. ప్లూటో రవి సింహరాశికి అధిపతి. చంద్రుడు కర్కాటకరాశికి, బుధుడు మిథున, కన్యలకు, కుజుడు మేష, వృశ్చికాలకు, శుక్రుడు వృషభ, తులలకు, గురువు ధనుర్మీనాలకు, శని మకర, కుంభాలకు అధిపతి. రాహు,కేతువులు ఛాయాగ్రహాలవటం మూలాన వీటికి ప్రత్యేక గృహాలు లేవు. ఏ రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి ఫలాల్ని, ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ ఫలాల్ని వీరు ఇస్తారు. పరాశరుడు 27 నక్షత్రాలకు ఈ తొమ్మిది గ్రహాల్ని అధిపతులుగా చెప్తూ వాటికి సంబంధించిన దశాసంవత్సరాల్ని ఈ విధంగా కేటాయించాడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు కేతువు అధిపతి. ఈ నక్షత్రాల్లో ఎవరు జన్మించినా వారి జన్మదశ కేతుమహర్దశ అవుతుంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలకు శుక్రుడు అధిపతి. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలకు రవి అధిపతి. రోహిణి, హస్త, శ్రవణంలకు చంద్రుడు అధిపతి. మృగశిర, చిత్త, ధనిష్టా నక్షత్రాలకు కుజుడు అధిపతి. ఆరుద్ర, స్వాతి, శతభిషంలకు రాహువధిపతి. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు గురువు అధిపతి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు శని అధిపతి. ఆశ్రేషా, జ్యేష్టా, రేవతి నక్షత్రాలకు బుధుడు అధిపతి. గ్రహాలకు చెప్పబడిన దశాసంవత్సరాలు రవి 6 సంవత్సరాలు చంద్రుడు 10 సంలు కుజుడు 7 సం.లు బుధుడు 17 సం.లు గురువు 16 సం.లు శుక్రుడు 20 సం.లు శని 19 సం.లు రాహువు 18 సం.లు కేతువు 7 సం.లు గ్రహాల శుభాశుభత్వములు రవి, కుజ, శని, రాహుకేతువులు, క్షీణ చంద్రుడు, పాపగ్రహాలతో కూడిన బుధుడు సహజ పాపులు. గురు, శుక్ర, బుధ, శుక్లపక్ష చంద్రులు శుభగ్రహాలు. గ్రహ మితృత్వ, శత్రుత్వాలు రవికి చంద్ర, కుజ, గురువులు – మిత్రులు, శని, శుక్రులు – శతృవులు, బుధుడు – సముడు. చంద్రునికి రవి, బుధులు – మిత్రులు, మిగిలిన గ్రహాలు సములు, శతృవులు లేరు. కుజునికి గురు, చంద్ర, రవులు – మిత్రులు, శుక్ర, శనులు – సములు, బుధుడు శత్రువు. బుధునికి శుక్ర, రవులు – మిత్రులు, కుజ, గురు, శనులు – సములు, చంద్రుడు శతృవు. గురునికి రవి, కుజ, చంద్రులు – మిత్రులు, బుధ, శుక్రులు – శత్రువులు, శని సముడు. శుక్రునికి శని, బుధులు – మిత్రులు, రవి, చంద్రులు – శత్రువులు, కుజ, గురులు – సములు. శనికి శుక్ర, బుధులు – మిత్రులు, రవి, చంద్ర, కుజులు – శత్రువులు, గురువు సముడు.
గ్రహాల పరిచయం గ్రహములకు ఉచ్ఛ, నీచ, మూలత్రికోణ క్షేత్రములు
సూర్యుడు: స్వక్షేత్రము : సింహము ఉచ్ఛ క్షేత్రము : మేషము మేషములో 10వ డిగ్రీ పరమోచ్ఛ భాగం నీచ క్షేత్రము : తుల తులలో 10వ డిగ్రీ పరమ నీచ భాగము మూలత్రికోణ క్షేత్రము : సింహము సింహములో మొదటి 20 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము.
చంద్రుడు : స్వక్షేత్రము : కర్కాటకము ఉచ్ఛ క్షేత్రము : వృషభము వృషభములో 3వ డిగ్రీ పరమోచ్ఛభాగం నీచ క్షేత్రము :వృశ్చికము వృశ్చికములో 3వ డిగ్రీ పరమ నీచభాగము మూలత్రికోణ క్షేత్రము : వృషభం వృషభంలో 3 డిగ్రీల తర్వాత నుంచి మూలత్రికోణము. కుజుడు స్వక్షేత్రములు : మేషము మరియు వృశ్చికము ఉచ్ఛ క్షేత్రము : మకరము మకరములో 28వ డిగ్రీ పరమోచ్ఛభాగం నీచ క్షేత్రము : కర్కాటకము కర్కాటకములో 28వ డిగ్రీ పరమ నీచ భాగము మూలత్రికోణ క్షేత్రము : మేషము మేషములో మొదటి 18 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము. బుధుడు: స్వక్షేత్రములు : మిథునము మరియు కన్య ఉచ్ఛ క్షేత్రము : కన్య కన్యలో 15వ డిగ్రీ పరమోచ్ఛభాగం నీచ క్షేత్రము : మీనము మీనములో 15వ డిగ్రీ పరమ నీచ భాగము మూలత్రికోణ క్షేత్రము : కన్య కన్యలో మొదటి 25 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము.
గురువు: స్వక్షేత్రములు : ధనుస్సు మరియు మీనము ఉచ్ఛ క్షేత్రము : కర్కాటకము కర్కాటకములో 5వ డిగ్రీ పరమోచ్ఛభాగం నీచ క్షేత్రము : మకరము మకరములో 5వ డిగ్రీ పరమ నీచ భాగము మూలత్రికోణ క్షేత్రము : ధనుస్సు ధనుస్సులో మొదటి 20 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము.
శుక్రుడు: స్వక్షేత్రములు : వృషభము మరియు తుల ఉచ్ఛ క్షేత్రము : మీనము మీనములో 27వ డిగ్రీ పరమోచ్ఛభాగం నీచ క్షేత్రము : కన్య కన్యలో 27వ డిగ్రీ పరమ నీచ భాగము మూలత్రికోణ క్షేత్రము : తుల తులలో మొదటి 20 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము. శని: స్వక్షేత్రములు : మకరము మరియు కుంభము ఉచ్ఛ క్షేత్రము : తుల తులలో 20వ డిగ్రీ పరమోచ్ఛభాగం నీచ క్షేత్రము : మేషము మేషములో 20వ డిగ్రీ పరమ నీచ భాగము మూలత్రికోణ క్షేత్రము : కుంభము కుంభములో మొదటి 20 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము. రాహు, కేతువులు: రాహువుకు ధనుస్సు ఉచ్ఛ క్షేత్రము, మిథునము నీచ క్షేత్రము. కేతువుకు మిథునము ఉచ్ఛ క్షేత్రము, ధనుస్సు నీచ క్షేత్రము
గ్రహాల పరిచయం గ్రహ లింగములు, జాతి ఇత్యాదులు
గ్రహ లింగములు : పురుష గ్రహములు :: రవి, కుజ, గురువులు . స్త్రీ గ్రహములు :: చంద్ర శుక్ర, రాహువులు నపుంసక గ్రహములు :: శని, బుధ, కేతువులు
గ్రహదిశలు: తూర్పు :: రవి ఆగ్నేయం :: శుక్రుడు దక్షిణ :: కుజుడు నైబుుతి :: రాహువు పశ్చిమం ::శని వాయువ్యం :: చంద్రుడు ఉత్తరం :: బుధుడు ఈశాన్యం :: గురు, కేతువులు ఆధిపత్యం వహిస్తారు.
గ్రహ బుుతు ఆధిపత్యము: వసంత బుుతువు :: శుక్రుడు గ్రీష్మ బుుతువు :: కుజుడు వర్ష బుుతువు :: చంద్రుడు శరదృతువు :: బుధుడు హేమంత ఋతువు :: గురువు శిశిర ఋతువు :: శని ఆధిపత్యం వహిస్తారు.
గ్రహ రుచులు: కారము :: రవి ఉప్పు :: చంద్రుడు చేదు :: కుజుడు తీపి :: గురువు వగరు :: శని షడ్రసములు :: బుధుడు పులుపు :: శుక్రుడు కారకత్వం వహిస్తారు.
చర, స్థిరాది గ్రహములు: స్థిర గ్రహము :: రవి చరగ్రహము :: చంద్రుడు ఉగ్ర గ్రహము :: కుజుడు మిశ్ర గ్రహము :: బుధుడు మృదు గ్రహము :: గురువు లఘుగ్రహము :: శుక్రుడు తీక్ష్ణగ్రహము. :: శని
గ్రహ ధాతువులు : ఎముకలు :: సూర్యుడు రక్తము :: చంద్రుడు ఎముకలలో మజ్జ :: కుజుడు చర్మము :: బుధుడు మేథస్సు :: గురువు వీర్యము :: శుక్రుడు స్నాయువు :: శని కారకత్వం వహిస్తారు.
భావముల పరిచయం – కారకత్వములు లగ్న కారకత్వములు
జాతకాన్ని విశ్లేషించటానికి ప్రధానమైనది లగ్నం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నట్లు అన్ని భావాల్లోకి లగ్నం ప్రధానమైనది. జాతకునికి సంబంధించిన ఏ అంశాన్ని అయినా లగ్నం, లగ్నాత్తు ఆయా భావాల కలయిక ఆధారంగా లెక్కించటం జరుగుతుంది. లగ్నం, ఇతర భావాలు, గ్రహస్థితులు, దశాభుక్తులు మొదలైన గణిత విభాగాన్ని మీకు ఇక్కడ అందించటం లేదు దీని కొరకు శ్రీ కె.ఎస్. కృష్ణమూర్తి గారి పుస్తకాలు కాని, లేక బి.వి.రామన్ గారి పుస్తకాలు కాని ఇతర ప్రముఖ జ్యోతిష్కుల పుస్తకాలు కాని చదవ వలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పాఠాల ద్వార ప్రధానంగా జాతకవిశ్లేషణకు ప్రాధాన్యత ఇవ్వటం వలన గణిత విభాగాన్ని అందించలేక పోతున్నాను. లగ్నం : ఒక వ్యక్తి జాతకాన్ని విశ్లేషించటానికి ప్రధాన ఆధారం. లగ్నం ఒక వ్యక్తి శారీరక స్థితి ఎలా ఉంటుందో చెపుతుంది. అతని మానసిక స్థితి, ప్రవర్తన, సమాజంతో అతను వ్యవహరించే విధానం , సమాజం పట్ల అతనికున్న దృక్కోణం , అతని అరోగ్య స్థితి, అలోచనా విధానం ఇలా ఒక్కటేమిటి ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని అంశాల ప్రాథమిక అవగాహన ఒక్క లగ్నం ద్వారా నిరూపితమవుతుంది. లగ్న కారకత్వాలు: పరాశరుడు లగ్నం గురించి వివరిస్తూ లగ్నం ద్వారా తెలుసుకోదగిన అంశాలను ఈ విధంగా చెప్పాడు. శ్లో।। తనుం రూపంచ జ్ఞానంచ, వర్ణం చైవ బలాబలం । ప్రకృతిం సుఖ దుఃఖంచ, తనుభావద్విచింత్యయేత్ ।। -బృహత్పరాశరి, భావవివేచనాధ్యాయం, 2 వ శ్లోకం. అంటే శరీరము, రూపము, వర్ణము, జ్ఞానము, బలాబలాలు, స్వభావము, సుఖదుఃఖాలు తనుభావమునుంచి తెలుసుకోవాలి. కాళిదాసు తన ఉత్తర కాలామృతములో లగ్నభావకారకత్వాల్ని మరింతనిశితముగా విశ్లేషించాడు.
దేహము, కాళ్ళు, చేతులు మొదలైన అవయవములు, సుఖదుఃఖములు, ముసలితనము, జ్ఞానము, జన్మభూమి, కీర్తి, స్వప్నము, బలము, ఆకారము, తర్వాత జరిగే ఫలితాలు అంటే ఒక కార్యముయొక్క పర్యవసానము ఏ విధముగా ఉంటుందో తెలుసుకోవటము, రాజనీతి, ఆయుర్దాయము, శాంతి, వయస్సు, కేశములు, అభిమానము, జీవనము, అపర విషయములు, జూదము, చిహ్నము, పౌరుషము, చర్మము, నిద్ర, అజ్ఞానము, ధనమును దొంగలించటము, మనుష్యులను తిరస్కరించు స్వభావము, రోగము లేకపోవటము, వైరాగ్యము, ప్రకృతి, కార్యములను చేయటం, జీవకార్యములయందు ప్రయత్నించుట, మర్యాదను పోగొట్టుకొనుట, మొదలైన ఫలితాలను లగ్నము ద్వారా చూడాలి. అంతే కాకుండా ప్రాపంచిక దృష్టి, స్నేహితుల తోబుట్టువులు, శతృవులు, భాగస్వాముల భార్యలు, పనివారల మరణము, ప్రథమ సంతానము యొక్క దూరప్రయాణాలు, వారి భాగ్యము, తోబుట్టువుల స్నేహితులు మొదలైన విషయాలు ఈ లగ్నము ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ప్రథమ భావానికి లగ్న, మూర్తి, అంగ, తను, ఉదయ, వపు, ఆద్య మరియు కల్పమని ఎనిమిది పేర్లు కలవు. దీని అధికారము శిరసుపై ఉంటుంది.
భావముల పరిచయం – కారకత్వములు ద్వితీయభావ కారకత్వములు:
ద్వితీయభావము మన ఆర్థిక సంబంధ వ్యవహారాలకు కారకత్వము వహిస్తుంది. ధన సంపాదన ఏ విధముగా ఉంటుంది, బ్యాంకు నిల్వలు, ఆదాయము, డబ్బు నిలవ చేస్తారా లేక ఖర్చు చేసే స్వభావము కలవారా? అనే అంశము, జాతకుని మాట తీరు, వాక్కులో కల దోషాలు, సౌమ్యముగా మాట్లాడతారా లేక కర్కశముగానా, వాక్కులో నత్తి లాంటి దోషాలు ఏమైనా ఉంటాయా, అనే విషయాలు, అతని ఆహారపుటలవాట్లు, కుటుంబము, కుటుంబముతో అతను వ్యవహరించే విధానము, కుటుంబము అతనితో వ్యవహరించే విధానము, కుటుంబ సమస్యలు, చిన్న కుటుంబమా లేక, పెద్దకుటుంబమా? తన కష్టముతో సంపాదించే ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటాయా మొదలైన విషయాలు ధన స్థానము ద్వారా తెలుసుకోవచ్చు. ధన స్థానము ద్వార తెలుసుకో గలిగే ఇతర విషయాలు క్రింద ఇవ్వబడుతున్నాయి. ధనము, వాక్కు, కుటుంబము, కుడికన్ను(స్త్రీలకు ఎడమకన్ను), బుద్ధి, విద్య, భుక్తి, కర్ణం , మంత్రము, ముఖము, బంగారము, కపటం , డబ్బు, మారకము, ఆస్తి, నాలుక, గోళ్లు, వెండి, అసత్యము, ప్రయాణము, స్నేహము, లోహములయందు ఇష్టత, సహాయము చేయుట, కృత్రిమము, అనృతము, ఆగ్రహము, రోషము, దాతృత్వము, మృదువచనము, పోషకత్వము, ధాతుబలము, శాంతము, ఆయుర్దాయము, భూసంపద, వాక్చాతుర్యము, శాస్త్రజ్ఞానము, జ్ఞాపకశక్తి, ఉద్దేశము, స్వర్ణధనము, యోగవిషయము, ధనకనక, వస్తు, వాహనాది ఆర్థిక విషయములు, వాటికి సంబంధించిన పత్రములు, బాండ్లు, లాభనష్టములు, సంపద, శిస్తువసూళ్ళు, బ్యాంకునిల్వలు, కళత్రవియోగము, రహస్యశతృవుల సోదరీ, సోదరులను, స్నేహితుల తల్లిదండ్రులను, ప్రథమ సంతానముయొక్క వృత్తి, సువర్ణ రత్నాదుల ప్రాప్తి, ఒక వ్యక్తి పొదుపరా లేక ఖర్చుచేసేవాడా అనే విషయము, కుటుంబసౌఖ్యము, వాక్కులో దోషములు మొదలైన విషయాలు ధన స్థానము వలన తెలుసుకోవచ్చు. దీని అధికారము వాక్కు మరియు కన్నులపై కలదు. ఈ ద్వితీయ స్థానానికి స్వ, కోశ, అర్థ, కుటుంబ, ధనస్థానమని ఐదు పేర్లు కలవు.
భావముల పరిచయం – కారకత్వములు తృతీయభావము:
మన ఆలోచనా విధానము, మన కోపము, సాహసము, మన తక్షణ నిర్ణయాలు, మన ప్రయాణాలు, మన తర్వాతపుట్టినవారు, బంధుగణము, చెవులు, చేతులు, చేతలు, మన ప్రయత్నాలు, దురాలోచనలు, మనము ఇతరులతో వ్యవహరించే విధానము, మనతో ఇతరులు వ్యవహరించే విధానము, మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఈ భావముద్వారా తెలుసుకోవచ్చు. ఇతర కారకత్వములు ఈ విధముగా ఉంటాయి.కనిష్ట సోదర, సోదరీమణులు, దుశ్చింత, సాహసము, కోపము, శాంతము, కంఠము, ఉపాయము, ఇరుగుపొరుగు, క్రయవిక్రయాలు, దగ్గరిప్రయాణాలు, చెవులు, చిత్తభ్రమ, యాత్ర, స్వధర్మము, శక్తి, అహంభావము, దాసదాసీలు, యుద్ధము, బొటనవేలు, ఉపాసన, కాళ్ళు, గొంతు, పితృమరణము, భోగము, బానిసత్వము, గానవిద్య, చెవినొప్పి, కర్ణభూషణాలు, భోజనపాత్ర, దైవభక్తి, జయము, ఆయుష్షు, ఋణము, ప్రథమసోదరుని లేక సోదరి(అన్న లేదా అక్క) సామాన్యప్రయాణాలు,విద్య, ఉత్తర, ప్రత్యుత్తరములు, వదంతులు, కలలు, తల్లియొక్క అనారోగ్యము, సంతానముయొక్క స్నేహితులు, తండ్రియొక్క రహస్యవిరోధులు, సోదర, సోదరిల సంఖ్య, వారితో మన సంబంధ, బాంధవ్యాలు, స్వపరాక్రమము, ప్రవాసయోగము మొదలైన అంశాలు ఈ భావము ద్వారా తెలుసుకోవచ్చు.దీని అధికారము చెవులు మరియు కంఠముపై కలదు. ఈ తృతీయ భావానికి సహజ, భ్రాతృ, దుశ్చిక్యస్థానమని మూడు పేర్లు కలవు.
భావముల పరిచయం – కారకత్వములు చతుర్థ భావము
విద్య, గృహం, బంధువు, సుఖం, వాపి, కూప, తటాకాదులు, శయ్య, పశువులు, పంట, వాహనం, తల్లి, పాతాళం, భూమి, శౌర్యం, ధైర్యం, ఔషధం, వివాదం, సాక్షి, ఉద్యానవనము, వ్యవసాయము, శత్రువులు, అభ్యంగనము, కృషి, క్షేత్రము, శీలం, సౌధము, శాస్త్రములు, పుస్తకములు, నిదినిక్షేపములు, హృదయం, బంధుసౌఖ్యం, దేవస్థానం, శుభం, వ్యాపారం, ఔన్నత్యం, పరలోక విషయం, పాడిభాగ్యం, జయం, గృహవిషయములు, వృద్ధాప్యము, అవసానకాలమందలి విషయములు, భూసంబంధ వ్యవహారములు, గుప్త ధనము, పట్టణములు, మహా నగరములు, తోటలు, పరిసరములు, మొదటి సోదరుని/సోదరి యొక్క ధన సంబంధ విషయములు, సంతానము యొక్క రహస్య శత్రువులు, స్నేహితుల అనారోగ్యము, పనివాళ్ళ స్నేహితులు, మాతృ సుఖము, చతుష్పద జంతువులు, వాహనముల సుఖము, మిత్ర సుఖం, భూ లాభం, స్వార్జిత ధనలాభం మొదలైన విషయాలు చతుర్థ భావం ద్వారా తెలుసుకోవచ్చు. దీని అధికారం చాతి పై కలదు. చతుర్థ భావానికి అంబ, పాతాళ, తుర్య, హిబుక, గృహ, సుహృత్, వాహన, యాన, బంధు, అంబు, నీర మరియు జల అనే 12 పేర్లు కలవు.
భావముల పరిచయం – కారకత్వములు పంచమభావము:
మనిషి బుద్ధికి సంబంధించిన విషయములు అంటే ఆలోచనలు, లలిత కళలు, పోటీ పరీక్షలు, ప్రేమ సంబంధ వ్యవహారాలు, సంతానము, పూర్వజన్మ విషయాలు మొదలైనవి ఈ భావము ద్వారా తెలుసుకోవచ్చు.ఇతర కారకత్వములు: పుత్ర, మంత్రి, ప్రతిభ, సంతానము, శక్తి, యోగము, బుద్ధి, కామము, ప్రణయము, ఆత్మ, వినోదము, అభిరుచి, పోటీపరీక్షలు, వ్యాపారము, లేఖనము, వినయము, రహస్యము, స్త్రీధనము, మంత్రిపదవి, వాయిద్యము, పాండిత్యము, మంత్రము, విద్య, మనస్సు, వివేకము, పితృవిత్తము, అన్నప్రదానము, కావ్యరచన, దూరచింత, గాంభీర్యము, ఘనత, ఉపాసన, స్నేహము, మేథాశక్తి, దైవభక్తి, పుత్రికలు, రాజ్యలాభము, ప్రేమవిషయములు, కామోద్రేకము, గర్భధారణ, జూదము,ఆస్తిక్రయవిక్రయముల యందలి లాభనష్టములు, తండ్రి ఆస్తి, 2వ సోదరుడు లేక సోదరి, నౌకరుల రహస్య విరోధులు, పూర్వపుణ్యము, సాహిత్యము, మంత్రవిద్య, ధోరణి, బుద్ధి, తర్వాతి జన్మ, యోగము, విద్యాప్రాప్తి, శాస్త్రజ్ఞానము, గ్రంథకర్తృత్వము, మంత్రతంత్రాలు తెలిసి ఉండటము, స్త్రీల గర్భధారణ సంబంధ విషయములు, సంతానముయొక్క సంఖ్య మరియు వారి శుభాశుభములు, సంతానము ద్వారా మనకు కలిగే సుఖదుఃఖాలు మొదలైనవి పంచమభావము ద్వారా తెలుసుకోవచ్చు.దీని అధికారము ఉదరము మరియు కుక్షిపైన కలదు. పంచమ భావానికి తనయ, బుద్ధి, విద్య, ఆత్మజ, పంచమ, వాక్స్థాన, మరియు తనుజ అనే 7 పేర్లు కలవు.
శతృభావము – జ్యోతిష పాఠములు
భావముల పరిచయం – కారకత్వములు శతృభావము:
మనిషికి సంబంధించిన బాధలు, భయాలు, అప్పులు, రోగాలు, మొదలైన వాటికి కారకత్వము వహించేది శతృభావము. మనలోని లోపాల్ని ఎత్తి చూపి వాటిని తొలగించుకోవటము ద్వారా మన అభివృద్ధికి తోడ్పడే భావమిది.దీని కారకత్వములు ఈ విధముగా ఉంటాయి. శతృవు, రణము, బÁుుణము, రోగము, శూల, గ్రంథులు, గాయాలు, భయము, పాపము, కోపము, దుఃఖము, వ్యసనము, పీడ, ఉన్మాదము, కారాగృహము, సేవకులు, మేహవ్రణము, మేనమామ, స్ఫోటకము, అపవాదులు, ఉష్ణము, రిపు, శ్లేష్మ వ్యాధులు, ఉగ్రకర్మలు, విరోధము, కుత్సిత బుద్ధి, చోరులు, అతిసారము, సహోదరాది కలహము,రహస్యస్థలములలో వ్యాధి, అతిమూత్రము, మూలవ్యాధి, మతిభ్రమ, ఆయుధము, జలగండము, బాంధవ్యము, విరోధము, మరణబాధ, అప్పు, వ్యభిచారము, విషము, కారాగారవాసము, దుస్తులు, దేహారోగ్య సంరక్షణ, ఆహారము, వృత్తి, సేవ, నౌఖరులు, చిన్న పెంపుడుజంతువులు, పోలీసు, మిలటరీ,నౌకా విషయములు, పినతండ్రి, పినతల్లి, వ్యవసాయదారులు, కౌలుదారులు, స్నేహితులమరణము, ప్రథమ సంతానముయొక్క ధన విషయములు, భాగస్థుల విరోధము, భార్య అనారోగ్యము, శతృవులు ఉంటారా లేదా?, వారి వృద్ధి లేదా నాశనము, రోగోత్పత్తి, గాయములు, మేనమామ ద్వారా సుఖదుఃఖములు, మొదలైన విషయములు ఈ ఆరవ భావము ద్వారా తెలుసుకోవచ్చు.దీని అధికారము కటి స్థానము పైన ఉంటుంది. ఈ భావానికి రిపు, ద్వేష, వైరి, క్షత, మరియు షష్ట భావమని ఐదు పేర్లు కలవు.
భావముల పరిచయం – కారకత్వములు సప్తమ భావము:
మనిషి జీవితములో అతిముఖ్యమైన అంశమైన వైవాహిక జీవితమునకు, జీవిత, వ్యాపార భాగస్వామికి, వ్యాపారానికి, కామానికి, కామసుఖానికి కారకత్వము ఈ సప్తమ భావము వహిస్తుంది.దీని ఇతర కారకత్వములు ఈ విధముగా ఉంటాయి. భార్య, తత్తరపాటు, అస్తము, కామము, వాణిజ్యము, క్రయవిక్రయము, సంగ్రహము, సౌఖ్యము, వైవాహికము, భోగము, చలనాంతర ధనము, స్థానచలనము, ప్రవాసము, మార్గమధ్యమము, పేచీలు, ప్రయాణభంగము, వ్యభిచారము, దత్తపుత్రత, వైరము, వేషము, ఆకారము, మారకస్థానము,స్త్రీ వైరము, రేతస్సు, జయము, భార్యాభర్తల సౌశీల్యము, బంధువులు, పెళ్ళి, వ్యాజ్యాలు, రెండవభార్య, రాజగౌరవము, బ్రతుకుతెరువు, మరణము, బుద్ధి విరోధము, వైవాహిక విషయములు, వ్యాపార భాగస్వాములు, ఒడంబడికలు, ప్రజానీకము, కోర్టు వ్యవహారములు, శతృవులు, వ్యాపార సంబంధములు, చోరీలు, జరిమానాలు, బందిపోట్లు,విడాకులు, తప్పిపోయిన వారు, శరణార్థులు, అన్యదేశములో వ్యాపారము, పలుకుబడి, షేర్స్ , తెగించిచేయు వ్యాపార విషయములు(స్పెక్యులేషన్ ), రెండవ సంతానము, మూడవ సోదరుడు లేక సోదరి, వైద్యులు, సోదరుల సంతానము, అధికారుల మన్నన, వివాహయోగము, వివాహ సమయము, భర్త లేక భార్య వచ్చే ప్రదేశము, వారి గుణగణములు, శరీరప్రకృతి, వారివలన కలిగే సుఖదుఃఖములు, మొదలైనవి ఈ భావము ద్వారా తెలుసుకోవచ్చు.దీని అధికరము తొడలు, వాటి పై భాగముపై కలదు. ఈ సప్తమ భావానికి జామిత్ర, అస్త, స్మర, మదన, ద్యూన, మరియు కామ అని ఏడు పేర్లు కలవు.
భావముల పరిచయం – కారకత్వములు అష్టమ భావము:
మనిషిని భయపెట్టే ఆయుస్సు గురించి ఈ భావం చెపుతుంది. ఎంత కలం బతుకుతాం, ఎలా చనిపోతాం అనేది ఈ భావం ద్వారా తెలుసుకోవచ్చు. దీని కారకత్వాల విషయానికి వస్తే ఆయుర్దాయం, మృత ధనం, పరాభవం, నిధనం, రంధ్రం, మృతి, నాశనం, జీవనోపాయం, మోక్షం, లయము, శత్రువులు, విచారణము, జబ్బు, చిద్రము, దుఃఖం, మోసం, అంగహీనం, అనుమానం, అవయవలోపం, నరకం, పాపం, సౌఖ్యం, మొహం, శత్రు పీడ, దండనం, శిరచ్చేదం, ఆకస్మిక మరణం, కలహం, ఆపదలు, శిక్షలు, ఋణ వృద్ధి, ద్రవ్య నష్టం, యుద్ధ మరణం, గుంపులో బాధలు, కింద పడటం, దీర్ఘ వ్యాధి, ప్రయత్నా విరమణ, అప్పు, హత్య వలన మరణం, పగ, విష భయం, చెరవాసం, అపజయం, వారసత్వం, ఇతరుల ఆస్థి, మరణం, మరణ కారణములు, మరణ విషయములు, లాటరీల పర్యవసానము, జీవిత భాగస్వామి యొక్క ఆస్తి, 3వ సోదరి/ సోదరుల ఆర్థిక విషయములు, న్యాయాధికారి, గురువు, స్నేహితుల మర్యాదలు, అధికారుల స్నేహితులు, మనోవ్యధ, అపమృత్యువు, ఆత్మహత్యాది అనిష్ట మరణం, జ్వరం మొదలైన రోగముల గురించి చెపుతుంది. దీని అధికారం గుహ్యెంద్రియముల మీద కలదు. అష్టమ భావానికి రంధ్ర, ఆయు, చిద్ర, యామ్య, నిధన, లయ పద, అష్టమ మరియు మృత్యు స్థానం అని 8 పేర్లు కలవు.
భావముల పరిచయం – కారకత్వములు భాగ్యభావము:
ఈ జన్మలో మనము చేసే పనులు, మన భాగ్యము, తండ్రి, గురువు మొదలైన అంశాలను ఈ భావము తెలియజేస్తుంది. దీనికి సంబంధించిన ఇతర కారకత్వములు ఈ విధముగా ఉంటాయి. భాగ్యము, తవదీకము, సుకృతము, గురువు, పితృజ్ఞానము, దయ, భక్తి, దేవతోపాసన, చిత్రం, ఆనందం, స్వామి, భుక్తి, దానం, ధర్మం, నిగ్రహం, శుభం, చిత్తశుద్ధి, యాత్ర, ముద్రాధికారము, న్యాయశాస్త్రం, బ్రాహ్మణత్వం, తండ్రి, దర్శనము, తపస్సు, తీర్థయాత్రలు, దూరప్రయాణములు, బ్రహ్మజ్ఞానము, పితృభక్తి, ఉపాసన, వైదికము, సుఖము, దైవము, గురుభక్తి, విద్యార్జన, రాజపూజ్యత, ప్రతాపం, పితృసంబంధమైన వస్తువులు, ధర్మం, సౌభాగ్యం, సత్రాలు, చావళ్ళు, పాఠశాల, ధర్మకార్యాలు, ఉపదేశం, సిద్ధిని పొందటం, గుళ్ళు, గోపురాలు నిర్మించటం, జ్ఞానం, వనవాసం, దూరప్రయాణములు, విదేశీయానము, స్వప్నములు, భావన, ఆధ్యాత్మిక విషయములు, ఉన్నతవిద్య, మత, న్యాయ, వైద్యశాస్త్ర సంబంధమైన గ్రంథ రచన, పాఠ్యపుస్తకములు, దైవజ్ఞానము, దయాలత, తత్వజ్ఞానము, ఆత్మసంబంధమైన పోకడలు, జీవిత భాగస్వామియొక్క సోదరసోదరీమణులు, మూడవ సంతానము, తండ్రి అనారోగ్యము, స్వధర్మనిష్ఠ, సత్కర్మలు, యోగ్యస్థానములో దానధర్మాదులు, భాగ్యోదయ కాలము, భాగ్యము లభించే విధానము మొదలైన అంశములు ఈ భావము ద్వారా తెలుసుకోవచ్చు.
భావముల పరిచయం – కారకత్వములు రాజ్యభావము:
మనము చేసే వృత్తి, వ్యాపారాలు, పనులు మొదలైన వాటికి ఈ భావము ప్రధానముగా కారకత్వము వహిస్తుంది. ఇతర కారకత్వములు: రాజ్యం, కర్మ, మానసం, వ్యాపారం, అంబరం, కార్యం, పుణ్యం, వీర్యం, సత్కర్మ, జీవనం, కీర్తి, నేర్పు, ప్రతిజ్ఞ, మంత్రసిద్ధి, నిగ్రహం, ముద్రాధికారం, విదేశీరాబడి, పితృజయాపజయం, ఉద్యోగం, అధికారం, మానము, తొడలు, గౌరవం, అలంకారము, వస్త్రములు, నిద్ర, కృషి, సన్యాసాశ్రమం, ఆగమకర్మలు, విద్యావిషయములు, అనేకపుణ్యాలు, భూలాభం, దయాగుణం, జ్ఞానమార్గం, ఇల్లు, దేవయుక్తి, సౌకర్యం, గర్భవాసం, దేశాటనం, మర్యాద, పలుకుబడి, అభివృద్ధి, యజమాని, పరిపాలనా విధాన విషయములు, అధికారవర్గము, న్యాయాధికారులు, అత్తగారు, దొంగలింపబడిన ఆస్థి, తండ్రియొక్క శతృవులు, స్నేహితుల విరోధులు, రాజాశ్రయం, రాజువలన విశేషాధికార ప్రాప్తి, వ్యాపారము వలన యశము లేదా అపయశము, పుణ్య సంవృద్ధి, పితృ సంబంధ సుఖదుఃఖాలు, తండ్రి మరణం ఇత్యాదులు ఈ భావం వలన తెలుస్తాయి.దశమభావానికి తాత, ఆజ్ఞ, మాన, కర్మ, ఆస్పద, గగన, నభ, వ్యోమ, మేషూరణ, మధ్య, వ్యాపార మరియు దశమభావమని పది పేర్లు కలవు.
భావముల పరిచయం – కారకత్వములు లాభభావము:
మనకు లాభించే అన్ని రకముల అంశములకు ఈ భావము కారకత్వము వహిస్తుంది. ఇతర కారకత్వములు ఈ విధముగా ఉంటాయి. లాభం, డబ్బురాబడి, ఆయుర్దాయము, జయము, శుభము, లాటరీ, ఉద్యోగ వృద్ధి, సర్వలాభము, ప్రభుధనం, దైవపూజ, మిత్రలాభం, కోర్కెలు, పిక్క, మోకాలు, మామవలన లాభం, జ్యేష్ట సోదరీ, సోదరులు, ధనార్జన, స్నేహం, ఆకస్మిక నష్టద్రవ్య లాభం, యోగఫలం, బహుభార్యలు, రాజగౌరవం, భూమి వృద్ధి, వాహన సుఖం, దుఃఖనివృత్తి, వస్త్రాభరణాలు, నాటక,సంగీత వృత్తి, జ్ఞానం, రాజ విహిత అనుకూలం, సముద్రయానం, స్నేహితులు, కోరికలు, వాంఛలు, యజమానియొక్క ఆస్తి విషయములు, వారసత్వ పర్యవసానము, తండ్రి మరణము, ధన, ధాన్య పశ్వాది అన్ని వస్తువుల లాభ విషయములు మరియు కుటుంబ సౌఖ్యము మొదలైన విషయములు ఈ లాభ భావము ద్వారా తెలుసుకోవచ్చు.దీనికి లాభ, ఆయ, ఆగమ, మరియు ప్రాప్తి అనే పేర్లు కలవు.
భావముల పరిచయం – కారకత్వములు వ్యయ భావము:
మనము చేసే ఖర్చులకు ఈ భావము ప్రధానముగా కారకత్వము వహిస్తుంది. ఇతర కారకత్వములు ఈ విధముగా ఉంటాయి. వ్యయము, పాపస్థానము, నరకము, అపోక్లీమము, లాక్షీణము, నాశము, అంత్యము, మనోవ్యథ, బంధనం, అంగవైకల్యం, శరీర గాయాలు, ఆత్మహత్యాదోషము, శతృవులు, వామనేత్రం, ఇతర దేశాలలో మరణం, రహస్య శతృభయం, ద్రోహం, దుర్వ్యయము, దుష్కార్యము, వివాహనష్టము, అన్యదేశ గమనం, భార్యానష్టము, జైలు ప్రాప్తి, ఉద్యోగ భంగం, జారత్వం, స్వర్గలోక ప్రాప్తి, నిద్రాభంగం, భూప్రదక్షిణ, అన్యదేశాలలో వృత్తి, విషయ సుఖం, నిద్రాసుఖం, మరణదండన, భోజన సుఖం, మంత్రవిద్య, నౌకల వ్యాపారం, పుణ్యం, యాగం, అడ్డంకులు, స్వయంకృతాపరాధములు, తలంపని చిక్కులు, వియోగము, దేశబహిష్కరణ, రహస్య వేదన, దుఃఖము, రహస్య విరోధులు, అపహరణ, విషమిచ్చుట, పుచ్చుకొనుట, దొంగరవాణా, కుట్రలు, ఆసుపత్రులు, కారాగారము, దాస్యము, పెద్దమృగములు, ఈర్ష్య, భాగస్తుని అనారోగ్యము, సంతానము, ఆయుష్యాంత వరకయ్యే ఖర్చులు, జాతకుడు పొదుపరా లేక ఖర్చుపెట్టే వాడా, అది సద్వ్యయమా లేక దుర్వ్యయమా? మొదలైన విషయాలు ఈ భావము ద్వారా తెలుసుకోవచ్చు.దీని అధికారం పాదాలపై కలదు. ద్వాదశ భావానికి భాంత్య, అంతిమ, ద్వాదశ మరియు రిఃప్ప అనే పేర్లు కలవు.
భావకారకత్వములు – అంశాల వారి విభజన:
లగ్నము నుంచి వ్యయము వరకు గల భావములు మానవజీవితములో వివిధ అంశములకు కారకత్వము వహిస్తాయని గత పాఠాల ద్వారా తెలుసుకున్నారు. మరింత సులభముగా అర్థము కావటానికి ప్రధాన కారకత్వములను అంశాల వారిగా తిరిగి ఒకసారి ఇస్తున్నాను. వ్యక్తిగత కారకత్వములు, శరీరాంగములు, సమాజము, ఇతరములు అనే విభాగాలుగా ఈ కారకత్వములను అందించటం జరుగుతున్నది.
1. లగ్నం: కేంద్రము మరియు కోణము వ్యక్తిగత కారకత్వములు: వ్యక్తియొక్క సంపూర్ణ స్వరూపము, వ్యక్తిగతము, వ్యక్తిత్వము, మనస్తత్వము, అంతరంగము, తెలివితేటలు, మనస్థైర్యం, ప్రవర్తన, గౌరవము, కీర్తిప్రతిష్టలు, జీవితములో ఉన్నతస్థానానికి ఎదగాలనే బలమైన కోరిక. శరీరము: బాల్యావస్థ, చిన్నతనము నాటి విషయాలు, పుట్టిన సమయములోని స్థితిగతులు, శరీరము, శరీరతత్వము, రోగనిరోధక శక్తి, తల, మెదడు, వెంట్రుకలు, చర్మము, వర్ణము సమాజము : ప్రస్తుత సమాజము, ప్రస్తుత పరిస్థితులు. ఇతరములు: జన్మస్థలము.
2. ధనస్థానము: మారకస్థానము. వ్యక్తిగతం: భాష, తెలిసిన భాషలు, భావవ్యక్తీకరణ, నిజాయితీ కలిగి ఉండటం, ముందుచూపు, తనవారికి సహాయం చేయడానికి ముందుండటం శరీరము: ముఖము, కన్నులు(ముఖ్యముగా కుడికన్ను), ముక్కు, నోరు, నాలుక, దంతములు. సమాజము: కుటుంబము, కుటుంబసభ్యులు మరియు వారి మంచి,చెడు, జీవితభాగస్వామి, (ముఖ్యముగా విడాకులు లేదా మొదటి భాగస్వామి మరణానంతరం వచ్చే రెండవ జీవితభాగస్వామి.) ఇతరములు: ఆర్థిక వ్యవహారములు, ధనము, చరాస్థులు, విలువైన వస్తువులు, డబ్బు, సంపద, ఆదాయము, దగ్గరి భవిష్యత్తు.
భావకారకత్వములు – అంశాల వారి విభజన: భ్రాతృ, మాతృ భావములు
3. భ్రాతృభావము: ఉపచయ స్థానము. వ్యక్తిగతము: సత్తువ, భోళాతనం, అమాయకత్వము, నాయకత్వ లక్షణము, ఆలోచన, స్వప్రయత్నం, స్వశక్తి, సేవ, సమాచారము, ఆధ్యాత్మిక అంశాల ప్రేరణ. శరీరము: చెవులు(ముఖ్యముగా కుడిచెవి), మెడ, గొంతు, మాట, థైరాయిడ్ గ్రంథి, భుజములు, కాలర్ బోన్ , ఊపిరితిత్తులు, భుజములు, చేతులు, శారీరక బలము మరియు స్వస్థత. సమాజము: తోడబుట్టిన వారు(ముఖ్యముగా మనకంటే చిన్నవారు), చుట్టుపక్కల వారు, సేవకులు, తోటి ఉద్యోగస్థులు, తోటివారు. ఇతరములు: ప్రయాణాలు(ముఖ్యముగా దగ్గరి ప్రయాణములు), ఉత్తర ప్రత్యుత్తరములు మొదలైన కమ్యూనికేషన్లు.
4.మాతృభావము: కేంద్రము. వ్యక్తిగత కారకత్వములు: ఆలోచనావిధానం, అంతర్గత జీవితం, కారణం, ఆనందము, రహస్యజీవితం, బయటకు కనబడని వ్యక్తిత్వం శరీరము: హృదయము, ఊపిరితిత్తులు, ఛాతి, పక్కటెముకలు సమాజము: తల్లి, మాతృసంబంధీకులు, రక్తసంబంధీకులు, కుటుంబసభ్యులు, స్నేహితులు, తనలాగ ఆలోచించేవారు, తనవంటి మనస్తత్వం కలవారు, సమర్థించువారు, సహాయకులు, సంబంధాలు, సేవాసంస్థలు, ఆర్గనైజేషన్స్, విద్యాసంస్థలు మొదలైనవి. ఇతరములు: స్థిరాస్థులు, ఇల్లు, భూమి, వంట ఇల్లు, స్వదేశము, సౌకర్యాలు, వాహనాలు, గనులు, ఖనిజాలు, నిధినిక్షేపాలు, వ్యవసాయ భూములు, నీటిసరఫరా మొదలైనవి.
భావకారకత్వములు – అంశాల వారి విభజన: పుత్ర, శతృ భావములు
5. పుత్రభావము: కోణము. వ్యక్తిగత కారకత్వములు: తెలివితేటలు మరియు మానసిక శక్తి సామర్థ్యాలు, సామర్థ్యము, శిక్షణ, విద్య, ముందుచూపు, విజయం, నిర్వహణా సామర్థ్యం, సునిశిత జ్ఞానము, విశ్లేషణా శక్తి. శారీరక కారకత్వములు: పైకడుపు, పొట్ట, కాలేయం, గాల్ బ్లాడర్ , స్ప్లీన్ సమాజము: సంతానము, ప్రేమికుడు/ప్రేమికురాలు, శిక్షణలో ఉన్నవారు, విద్యార్థులు, శిష్యులు. ఇతరములు: సామాజిక జీవితం, మంత్రములు, వేద సంబంధమైనవి, ఆశీర్వాదము, యంత్రములు, తాయెత్తులు మొ. భవిష్యత్తు,
6. షష్టభావము: దుస్థానము మరియు ఉపచయ స్థానము. వ్యక్తిగతం: బలహీనతలు, చెడుపనులు, మానసిక సమస్యలు మరియు శారీరక సమస్య దుఃఖము, బాధలు మరియు సందేహములు మొదలగునవి. శరీర సంబంధ కారకత్వములు: అనారోగ్యము మరియు గాయములు, ప్రేగులు, కిడ్నీలు, జీర్ణకోశము, అల్సర్లు, క్రమబద్ధము లేని భోజనము సమాజము: శతృవులు, ప్రత్యర్థులు, పోటీదారులు, దొంగలు. ఇతరములు: అడ్డంకులు, కష్టములు, న్యాయవివాదములు, తప్పుగా అర్థం చేసుకోవటం, దురదృష్టము, పోట్లాట, దొంగతనము, విషము.
భావకారకత్వములు – అంశాల వారి విభజన: కళత్ర, ఆయుర్భావములు
సప్తమభావము: కేంద్రము, మారక స్థానము. వ్యక్తిగత కారకత్వములు: కోరికలు, అంతర్గత ఆనందములు, ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు, స్వేచ్ఛాజీవితం పై ఇచ్ఛ, నిజాయితీ, ఇతరులపై గెలుపు, శరీరసంబంధ కారకత్వములు: జననేంద్రియాలు, బ్లాడర్ , ప్రొస్టేటు గ్రంథి, సంతానసంబంధము, కామము సమాజ సంబంధ కారకత్వములు: జీవితభాగస్వామి, వ్యాపారభాగస్వామి ఇతరములు: ప్రయాణములు, ప్రవాసము, వ్యాపారము.
అష్టమభావము: రంధ్రము(బలహీనతలు), దుస్థానము. వ్యక్తిగత కారకత్వములు: బలహీనతలు, భయము, తప్పు, ఓటమి, ఆకస్మికపతనం, పూర్వజన్మ కర్మకారణముగా ఈ జన్మలో కలిగే బాధలు, దురదృష్టము, పరిశోధన, మంత్ర, తంత్రాది విద్యలపై ఆసక్తి, భూత, భవిష్యత్ జ్ఞానము శరీరసంబంధకారకత్వములు: ఆయువు, బలహీనత, వ్యాధులు, ప్రమాదములు, ఆకస్మిక మరణము, బహిర్జననేంద్రియాలు సమాజసంబంధ కారకత్వములు: శతృవులు, యుద్ధము ఇతరములు: వీలునామా, వారసత్వపు ఆస్తి, అతీంద్రియ జ్ఞానము, రహస్య విద్యలు
భావకారకత్వములు – అంశాల వారి విభజన: బాగ్య, రాజ్య భావములు
9. భాగ్యభావము: కోణము. వ్యక్తిగత కారకత్వములు: ఉన్నత విద్య, ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి, భక్తీ భావము, బాధ్యత, శక్తి, నిజాయితీ, దానగుణం, సేవాభావం, తీర్థ యాత్రలు, పూర్వజన్మ కారక అదృష్టము, భాగ్యము, బాధ్యత, సంప్రదాయక జీవనం పై ఆసక్తి, పెద్దల యెడ, గురువుల యెడ గౌరవం శరీర సంబంధ కారకత్వములు: తుంటి ఎముక, తోడ, ఎడమ కాలు సమాజసంబంధ కారకత్వములు: తండ్రి, గురువు, పెద్దవారు ఇతరములు: సహజ న్యాయం, వైద్యం, పరిహారములు, న్యాయము, గతము
10. రాజ్యభావము: కేంద్రము, ఉపచయము. వ్యక్తిగత కారకత్వములు: ఖర్చులు, నైపుణ్యము, సామర్థ్యము, వృత్తి, పరిపాలన, గౌరవం, గుర్తింపు, ఉన్నతస్థానము, అధికారము, అజమాయిషీ, ప్రభుత్వ ఉద్యోగం, జీవనోపాది శరీరసంబంధ కారకత్వములు: మోకాలు సమాజము: తండ్రి సామాజిక స్థితిగతులు, ఉన్నత పదవిలో ఉన్నవారు, అధికారి, అజమాయిషీ చేసేవారు ఇతరములు: విదేశాములలో స్థిరనివాసం,
భావకారకత్వములు – అంశాల వారి విభజన: లాభ, వ్యయ భావములు
11. లాభభావము: ఉపచయ స్థానము. వ్యక్తిగత కారకత్వములు: కోరికలు తీరటం, ఆనందించటం, వస్తుసేకరణ, లాభము, ఆదాయము, సేవ, కోరిక శరీర సంబంధ కారకత్వములు: కుడికాలు, ఎడమచెవి సమాజసంబంధ కారకత్వములు: తనకంటే పెద్దవారు, మిత్రులు ఇతరములు: అన్నిరకముల లాభములు
12. వ్యయభావము: దుస్థానము. వ్యక్తిగత కారకత్వములు: ఖర్చులు, ఖరీదు, వ్యయము, పడిపోవటం, నొప్పి, నష్టము, నష్టపరిహారము చెల్లించటము, దూరప్రాంతాలకు వెళ్ళటం, దానధర్మాలకొరకు డబ్బు ఖర్చు చేయటం, త్యాగము, పునర్జన్మ, రహస్యము శరీరసంబంధ కారకత్వములు: పాదములు, ఎడమకన్ను, నిద్రాభంగం, జీవిత చరమాంకం సమాజసంబంద కారకత్వములు: ఒంటరితనం ఇతరములు: ఆసుపత్రిలో లేదా జైలులో ఉండటం, సన్యాసము, దాక్కొనే ప్రదేశం, విదేశములు, దూరప్రాంతములు
ఇంతవరకు జాతకచక్రం వేయటం మరియు గ్రహ, భావ కారకత్వాముల గురించి తెలుసుకున్నారు. రాబోయే పాఠాల్లో రాశి కారకత్వములు, నక్షత్రములు, జ్యోతిషము లో ఉన్న పద్ధతులు, జాతకచక్రాన్ని ఎలా చదవాలి, దశ, భుక్తి, గోచారం…..మొదలైన అంశాలకు సంబంధించిన పాఠాలు అందించబడతాయి. నాకు సమయం చిక్కినప్పుడల్లా పాఠాలు అందించటం జరుగుతుంది. ఆలోపు బృహత్ పరాశర హోరా, సారావళి, ఉత్తర కాలామృతం మొదలైన ప్రాచిన జ్యోతిష గ్రంథములు. బి.వి. రామన్, కే.ఎస్. కృష్ణమూర్తి మొదలైన ఆధునిక జ్యోతిష పండితుల పుస్తకాలు చదవండి. మరిన్ని జ్యోతిష పాఠాలు త్వరలో అందజేయ బడతాయి.