అన్నమయ్య కీర్తన ఇతరులకు నిను ఇతరులకు నిను నెరుగదరమా ॥ సతతసత్యవ్రతులు సంపూర్ణమోహవిర- హితులెరుగుదురు నిను నిందిరారమణా ॥ నారీకటాక్షపటునారాచభయరహిత- శూరులెరుగుదురు నిను జూచేటిచూపు । ఘొరసంసార సంకులపరిచ్ఛేదులగు- ధీరులెరుగుదురు నీదివ్యవిగ్రహము ॥ రాగభోగవిదూర రంజితాత్ములు మహా- భాగులెరుగుదురు నిను బ్రణుతించువిధము । ఆగమోక్తప్రకారాభిగమ్యులు మహా- యోగులెరుగుదురు నీవుండేటివునికి ॥ పరమభాగవత పదపద్మసేవానిజా- భరణు లెరుగుదురు నీపలికేటిపలుకు । పరగునిత్యానంద పరిపూర్ణమానస- స్థిరు లెరుగుదురు నిను దిరువేంకటేశ ॥
