Navagraha Puja : నవగ్రహాల పూజ ఇంట్లో ఎందుకు చేయకూడదు?

Navagraha Puja : హిందూమతంలో నవగ్రహాలకి ప్రత్యేకమైన స్థానం ఉంది. 9 దైవిక గ్రహాలు మానవ జీవితంపై పెను ప్రభావం చూపిస్తాయన్న నమ్మకం ఉంది. అందుకే గ్రహదోష నివారణకి పూజలు చేస్తుంటారు. రాహు కేతువు పూజలు చేయిస్తుంటారు. పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేకంగా నవగ్రహ పూజలు చేయించుకుంటారు. ఇంట్లో రకరకాల దేవుళ్ల పటాలను పెట్టుకుని పూజించే మనం నవగ్రహాల విషయంలో మాత్రం అలాంటి ఆలోచన చేయరు. మనకిష్టమైన దేవుళ్ల విగ్రహాలను ఇళ్లల్లో పెట్టుకుని పూజించినంత ఈజీగా నవగ్రహాలను తీసుకురారు.
శాస్త్రం ప్రకారం నవగ్రహాలను ఇంట్లో పెట్టుకోకూడదు..పరమేశ్వరుని ఆదేశాల ప్రకారం నవగ్రహాలు నిత్యం పని చేస్తూ, భ్రమణ స్థితిలో ఉంటాయి. అందుకే 9 గ్రహాలను ఇళ్లల్లో పెట్టుకొని పూజలు చేయకూడదు. నవగ్రహాలను ప్రధాన దేవాలయంలో ఉంచరు. ఏ ప్రాంతంలో అయినా వాటిని ఉపలయాల్లో ఉంచి పూజలు చేస్తుంటారు. శివాలయాలకి వెళ్లే వారు ముందుగా నవ గ్రహాలకి ప్రదక్షణలు చేసిన తర్వాతే పరమేశ్వరుడ్ని పూజిస్తారు. నవగ్రహ పూజ తర్వాత శివ దర్శనం ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతుంటారు. నవగ్రహాల్లో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది.
శనిశ్వరుడి విషయంలో భక్తికన్నా భయం భక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. శనీశ్వరుడు విధి నిర్వహణలో ప్రతి ఒక్కరినీ సమాన దృష్టితోచూస్తుంటాడు. ముల్లోకాల్లో శని బాధపడని వారు ఉండరు. అందుకే ఇలాంటి దేవుడ్ని మనం ఉండే ఇంట్లో ఉంచుకొని పూజించకూడదు. శనిదోషం పరిహార పూజైనా, ఇతర గ్రహదోష నివారణా పూజైనా గుడికి మాత్రమే వెళ్లి చేసుకోవాలి . అలాగే శనీశ్వరుని ఫోటోలు కూడా పెట్టకూడదంటారు. నవగ్రహాలకి 3 లేదా 9 ప్రదక్షణలు మాత్రమే చేయాలి. మొదట సూర్యుడికి నమస్కరించి తర్వాత ప్రదక్షణ చేయాలి.