Ghantasala bhagavad gita – ఘంటశాల భగవద్గీతా

001 ॥ పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయమ్ ।
వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతమ్ ॥
అద్వ్యైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీమ్ ।
అంబా! త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ ॥

భగవద్గీత. మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరుగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథియై నిలిచెను.

యుద్ధ రంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి, హృదయము ద్రవించి,

002 ॥ న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ ।
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ॥ (01:32)

స్వజనమును చంపుటకు ఇష్టపడక “నాకు విజయమూ వలదు, రాజ్య సుఖమూ వలదు” అని ధనుర్బాణములను క్రింద వైచె. దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ,

003 ॥ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ।
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ॥ (02:11)

దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములూ, శాశ్వతములూ అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు.

004 ॥ దేహినోస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా ।
తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ॥ (02:13)

జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము యెట్లో, మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుకు ఈ విషయమున ధీరులు మోహము నొందరు.

005 ॥ వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి ।
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ ॥ (02:22)

మనుష్యుడు, ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించునో, అట్లే, ఆత్మ – జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది.

006 ॥ నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః ।
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ॥ (02:23)

ఆత్మ నాశనములేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింప జాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆర్పివేయనూ సమర్థము కాదు. ఆత్మ నాశనములేనిది.

007 ॥ జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి ॥ (02:27)

పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు.

008 ॥ హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ ।
తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ॥ (02:37)

యుద్ధమున మరణించినచో వీర స్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జునా, యుద్ధమును చేయ కృతనిశ్చ్యుడవై లెమ్ము.

009 ॥ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ।
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి ॥ (02:47)

కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితము పైన లేదు. నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు. అట్లని, కర్మలను చేయుట మానరాదు.

010 ॥ దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః ।
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ॥ (02:56)

దుఃఖములు కలిగినపుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినపుడు స్పృహ కోల్పోని వాడును, రాగమూ, భయమూ, క్రోధమూ పోయినవాడును స్థిత ప్రజ్ఞుడని చెప్పబడును.

011 ॥ ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే ।
సంగాత్-సంజాయతే కామః కామాత్-క్రోధోభిజాయతే ॥ (02:62)

క్రోధాద్-భవతి సమ్మోహః సమ్మోహాత్-స్మృతివిభ్రమః ।
స్మృతిభ్రంశాద్-బుద్ధినాశో బుద్ధినాశాత్-ప్రణశ్యతి ॥ (02:63)

విషయ వాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వానియందనురాగ మధికమై, అది కామముగా మారి, చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి, దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును.

012 ॥ ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి ।
స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ॥ (02:72)

ఆత్మజ్ఞాన పూర్వక కర్మానుష్ఠానము, బ్రహ్మ ప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మ ప్రాప్తిని చెందగలడు.

013 ॥ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ ।
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ॥ (03:03)

అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగు చున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడియున్నది.

014 ॥ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః ।
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ॥ (03:14)

అన్నమువలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూడును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము.

015 ॥ ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః ।
అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి ॥ (03:16)

పార్థా! నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమునుబట్టి, ఎవడు అనుసరింపడో వాడు ఇంద్రియలోలుడై పాప జీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కానివాడు సదా కర్మలనాచరించుచునే యుండవలెను.

Read more